HomeNewsBreaking Newsటిఆర్ఎస్‌ అంటే.. తెలంగాణ రాష్ట్ర సంఘ్‌ పరివార్‌

టిఆర్ఎస్‌ అంటే.. తెలంగాణ రాష్ట్ర సంఘ్‌ పరివార్‌

కొడంగల్‌: టిఆర్‌ఎస్‌.. అంటే ‘తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌పరివార్‌’ అని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రాఫేల్‌ గురించి కెసిఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ‌లో ప్ర‌జాఫ్రంట్‌ అధికారంలోకి రావడం ఖాయమని, నీళ్లు, నిధులు, నియమకాల కలను నిజం చేస్తామని రాహుల్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రజలు తమకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, నీళ్లు నిధులు, నియామకాలు అన్నీ తమకే అని కలలు కన్నారు. కానీ, ఈ నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఆశించినట్లుగా ఏమీ చేయలేకపోయింది. ప్రజల కలలను కెసిఆర్‌ వమ్ము చేశారు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా?’’ అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ బడ్జెట్‌ రూ.2లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ, కెసిఆర్‌ కుటుంబ ఆదాయం మాత్రమే పెరిగింది. ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లను మార్చి రూ.40వేల కోట్లను దోచుకున్నారు. లక్ష ఉద్యోగాలు అని చెప్పి యువతను మోసం చేశారు’’ అని రాహుల్‌ విమర్శించారు.
వచ్చేది మేమే.: ఉత్తమ్‌
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 స్థానాల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుంద‌ని టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. డిసెంబర్‌ 11న రాష్ట్రంలో ప్ర‌జాఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేద‌ని, విద్యార్థులకు కెసిఆర్‌ ప్రభుత్వం న్యాయం చేయలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రాగానే రేషన్‌లో ఇచ్చే దొడ్డు బియ్యం స్థానంలో ఏడు కిలోల సన్నబియ్యం, ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామ‌ని ఉత్తమ్‌ తెలిపారు.
పోరాటం కొనసాగిస్తా..: రేవంత్‌
‘‘40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ కోస్గి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు ప్రజాఫ్రంట్‌ను గెలిపించడానికి రాహుల్‌ వచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో కెసిఆర్‌ నామీద చాలా కేసులు పెట్టారు. జైళ్లో పెట్టించినా ప్రజల అండతో నా పోరాటం కొనసాగిస్తా. ఈ ఎన్నికలు.. కెసిఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. యువత బలిదానంతో వచ్చిన తెలంగాణలో కేవలం కెసిఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కెసిఆర్‌ హయాంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు’’ అని రేవంత్‌ అన్నారు.
కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపాలి: కోదండరామ్‌
‘‘తెలంగాణ కోసం కొదమ సింహాల్లా కొడంగల్‌ ప్రజలు పోరాడారు. నీటి వసతి లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. గుత్తేదారుల జేబులు నింపడానికే ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. కొడంగల్‌ ప్రజలకు న్యాయం జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలి. మేం రాగానే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తాం. ఫాంహౌజ్‌ నుంచి వచ్చిన కేసీఆర్‌ను మళ్లీ అక్కడికే పంపించాలి’’ అని కోదండరామ్‌ అన్నారు.

Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments