HomeNewsBreaking News‘నంది’ స్థానంలో ‘గద్దర్‌' అవార్డులు

‘నంది’ స్థానంలో ‘గద్దర్‌’ అవార్డులు

వచ్చే ఏడాది నుంచి గద్దర్‌ జయంతి రోజున పురస్కారాల ప్రదానం
ట్యాంక్‌ బండ్‌పై విగ్రహం ఏర్పాటు అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం : గద్దర్‌ జయంతి వేడుకల్లో సిఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేసే నంది అవార్డులను ఇక నుండి ‘గద్దర్‌ అవార్డు’లుగా ప్రదా నం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ట్యాంక్‌ బండ్‌పైన గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు నెలల్లో కెసిఆర్‌ సిఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని, అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని, ఇటువంటి ఆలోచనలు వారి ఒంటికి, ఇంటికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఐదేళ్లు పాటు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమదన్నారు. ‘ప్రజా యుద్ధనౌక గద్దర్‌ జయంతి’ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించారు. గద్దర్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించి, ఆ తర్వాత త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమించిన వ్యక్తి గద్దరన్న అని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు తమకు స్ఫూర్తిధాయకమని, ఆయనతో మాట్లాడితే తమకు వెయ్యేనుగుల బలం అని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్‌గా మార్చామని వివరించారు. ఏ దళితుడిని సిఎం చేస్తానని మాట ఇచ్చి కెసిఆర్‌ మోసం చేశారో, తమ ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుని వద్దకే వచ్చి ఎంఎల్‌సి విత పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారని సిఎం రేవంత్‌ గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉన్నదన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారని విమర్శించారు.డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్‌ అని, ఆయన తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టమని చెప్పారు. గద్దర్‌ ఆలోచనలు, భావజాలాన్ని, రచనలు, పుస్తకాలను, పాటలను అన్నింటిని బతికిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం గద్దర్‌ ఆలోచనలను సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు. గద్దర్‌ కోరుకున్నట్టుగా సమ సమాజ స్థాపన కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడుస్తుందని, ప్రపంచం తో పోటీ పడేలా ప్రగతిశీల భావాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని భట్టి తెలిపారు. గద్దర్‌ అన్న ఆలోచనలు, పాటలను నాడు నిషేధించిన చోటనే, గద్దర్‌ జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆషామాషీ కాదని గుర్తు చేశారు. గద్దర్‌ కోరుకున్న సామాజిక తెలంగాణ ప్రగతి శీల రాష్ట్రాన్ని నిర్మిద్దామన్నారు. ధరణి పేరుతో అన్యాయంగా పేదల నుండి గుంజుకున్న భూములను సరిచేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి అనే భూతాన్ని పక్కన పెట్టేందుకు ప్రక్షాళన మొదలు పెట్టిందన్నారు. కొట్లాడి ,కోరి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీగా మారడంతో, ప్రజల ఆకాంక్షలు నెరవేరక పోగా, మాట్లాడే హక్కును కూడా హరించిన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కోసం ఆదిలాబాద్‌ నుండి ఖమ్మం వరకు చేసిన తన పాదయాత్రకు పీపుల్స్‌ మార్చ్‌ అని పేరు పెట్టిందే గద్దర్‌ అని భట్టి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ వచ్చే జయంతి వరకు గద్దర్‌ పురస్కార్‌ పేరుతో కళాకారుణ్ణి సత్కరించుకొని, జీవ కలలు బతికుండేలా నగదు బహుమతి ఇవ్వాలని కోరారు. అప్పట్లో గద్దర్‌ పాట తమకు స్ఫూర్తిఅని అన్నారు. డిసెంబర్‌ 7 న గేట్లు తెంచుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజా పాలన పేరుతో గ్యారంటీ స్కీమ్స్‌కు దరఖాస్తులను స్వీకరించామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో అనేక రకాలుగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చే కార్యక్రమాలు కొనసగుతున్నాయన్నారు. ఈ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కిగౌడ్‌, గద్దర్‌ సతీమణి విమల, కుమార్తె వెన్నెల తదితరులు హాజరయ్యారు.
గేటు ముందు కూర్చున్నప్పటికీ గద్దర్‌కు అవకాశం దక్కలేదు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ శాసనసభాపక్షం నేత కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ ఆనాడు గత సిఎంను కలిసేందుకు మూడు గంటలు గేటు ముందు కూర్చున్నప్పటికీ గద్దర్‌కు అవకాశం దక్కలేదని గుర్తు చేశారు. గద్దర్‌ స్ఫూర్తి ద్వారా ఏర్పడిన ప్రజాప్రభుత్వం గద్దర్‌ జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు అభినంధించారు. గద్దర్‌ మాటలు ఒక తూట, ఆయన చిందు వేస్తే అదొక పిడుగు, పాట పాడితే నిప్పుల రాగం అని కొనియాడారు. ఆ కాలానికి, ఇ కాలానికి , అందరకీ గద్దర్‌ ఒక సంధానకర్త అని అభివర్ణించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments