HomeNewsNationalమణిపూర్‌ ప్రస్తావనేదీ?

మణిపూర్‌ ప్రస్తావనేదీ?

మోడీ పాలన విజయాలు ఏకరువుపెట్టిన రాష్ట్రపతి
పార్లమెంట్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
‘సెంగోల్‌’తో ఊరేగింపుగా రాక
న్యూఢిల్లీ :
అయోధ్యలో రామాలయ నిర్మాణం, దేశ ఆర్థిక రంగ ప్రగతే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దశాబ్దకాలంగా చేసిన పరిపాలనలో ఘన విజయాలని రాష్ట్రపతి ద్రౌపతీముర్మూ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. మణిపూర్‌లో ఘటనలను ఎక్కడా ప్రస్తావించలేదు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారంనాడు పార్లమెంటు ఉభయసభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. శతాబ్దాలక్రితం నాటి రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించుకున్నామని రాష్ట్రపతి తన ప్రసంగంలో అన్నారు. మోడీ ఆర్థిక విజయాలను ఆమె 75 నిమిషాలసేపు ఏకరువు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్‌ సోనియాగాంధీ, హోంమంత్రి అమిత్‌ షా, మంత్రులు పీయూష్‌ గోయల్‌, నితిన్‌ గడ్గరీ తదితరులు ముందు వరుసల్లో ఆశీనులయ్యారు. “ఈనాడు దేశంలోని జమ్మూ కశ్మీరు ప్రాంతం లో ప్రజలు ఎంతో భద్రతతో ఉన్నారు, అంతకుముందు వారికి భద్రత లేదు, మార్కెట్‌ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉండేవి, సమ్మెలు జరిగేవి, కానీ ఈనాడు పరిస్థితి మారింది” అన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాద చర్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, ఈ రాష్ట్రాలలో అనేక సంస్థలు శాశ్వత శాంతి చర్యలకు శ్రీకారం చుట్టాయన్నారు. “నక్సలైట్లు ప్రభావితం చేసే ప్రాంతాలలో కూడా నక్సలిజం గణనీయంగా తగ్గుముఖం పట్టింది, నక్సల్స్‌ హింస తగ్గిపోయింది, యువతరం శక్తి, నారీశక్తి, రైతు లు, పేదలు వీరంతా నాలుగు బలమైన స్తంభాలుగా ఉన్నారు, ఈ గొప్ప మూలస్తంభాలపైనే అభివృద్ధి భారతాన్ని నిర్మిస్తామని అన్నారు. చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగ విజయాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. “మా బాల్యం నుండీ గరీబీ హఠావో నినాదం విన్నాం, కానీ ఈనాడు మొదటిసారి మన జీవితాల్లో చాలా పెద్ద స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించడాన్ని చూస్తున్నాం, నీతీ ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో గడచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం 25 కోట్లమంది ప్రజలను ప్రభుత్వ పథకాల ద్వారా దారిద్య్రం నుండి గట్టెక్కించింది” అన్నారు. దేశ రక్షణ ఉత్పత్తులు ఒక లక్ష కోట్ల స్థాయిని దాటిపోయాయని ప్రశంసించారు. మేకిన్‌ ఇండియా,, ఆత్మనిర్భర్‌లు గొప్ప ఫలితాలనిచ్చాయన్నారు. దేశాన్ని అభివృద్ధి ప్రయాణంలో బలోపేతం చేశాయన్నారు. మహిళా బిల్లును ఎంతో సజావుగా పార్లమెంటు ఆమోదించిందని ప్రశంసించారు. ప్రపంచమంతా సంక్షోభం ఉన్నాగానీ మనదేశం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచిందని, దేశ ప్రజలపై అదనపు భారాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్రపతి అన్నారు. వరుసగా రెండు త్రైమాసికాలలో దేశం 7.5 శాతం మేరకు ఆరర్థిక వృద్ధిని సాధించిందని ప్రశంసించారు. చిన్న పరిశ్రమలకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. మహిళలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం సహాయం అందించిందని, వారికి కోరినవిధంగా పరపతి అందుబాటులోకి వచ్చిందన్నారు. సాయుధ బలగాల్లో కూడా తమ ప్రభుత్వం మహిళలకోసం ఒక పర్మినెంట్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. సైనిక్‌ స్కూళ్ళలో బాలికలకు కూడా మొదటిసారి ప్రవేశాలను తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
దేశ రక్షణకోసం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ప్రతిఘటించి, విస్తరించకుండా గట్టి గుణపాఠాలు చెబుతున్న భారత సాయుధ బలగాలను ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు. పాకిస్థాన్‌, చైనా దేశాల విస్తరణవాదాన్ని తిప్పి కొట్టారని ఆమె ఆ దేశాల పేర్లు ప్రస్తావిస్తూ మన బలగాలకు అభినందనలు తెలియజేశారు. భారతదేశాన్ని పరివర్తనదిశగా మళ్లించేందుకు తమ ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్నదని ఆమె చెప్పారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం చేరేదిశగా దేశం పరివర్తన చెందుతోందన్నారు. జి శిఖరాగ్ర సదస్సును మనదేశం ప్రపంచం మెచ్చేవిధంగా విజయవంతంగా నిర్వహించిందని, దీనివల్ల ప్రపంచదేశాల్లో భారత్‌ స్థానం మరింత పటిష్టవంతమైందన్నారు. మొదటిసారి దేశంలోని జమ్మూ కశ్మీరులో, ఈశాన్యప్రాంత రాష్ట్రాలలో అంతర్జాతీయస్థాయీ సమావేశాలకు అతిథ్యం లభించిందన్నారు. “రాబోయే శతాబ్దాల భవితవ్యాన్ని శిలాక్షరాలతో లిఖించేందుకు భారతదేశానికి ఇదే సరైన సమయం. మన పూర్వీకులు మనకు వేలాది సంవత్సరాల గొప్ప ఘన చరిత్రను వదిలివెళ్ళారు, ఈనాటికీ కూడా మన పూర్వీకులు ముందుచూపుతో సాధించిన విజయాలను మనం మననం చేసుకుంటూనే ఉన్నాం, ఈనాటి తరం శతాబాలనాటి వారి వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ కొత్త దేశాన్ని నిర్మించాలి” అని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో అయోధ్య, రామాలయం ప్రస్తావనపై ప్రసంగిస్తున్నంతసేపూ అధికారపక్ష ఎంపీలు బల్లలు చరుస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆస్వాదించారు. అయోధ్యకు ఇక భారీ సంఖ్యలో యాత్రికులు వెల్లువెత్తుతారని ఆమె అన్నారు. “గడచిన పదేళ్ళుగా భారతదేశం ఈ విధమైన లక్ష్యాలను అనేకం నిర్దేశిచుకుంది, దశాబ్దాలుగా దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కలలు నెరవేర్చేందుకు, జాతి ప్రయోజనాలకోసం వాటిని పూర్తిచేసింది, అయోధ్యలో రామాలయం వందల సవత్సరాలనాటి కల…ఆ స్వప్నం ఈనాటికి సాకారమైంది” అని ద్రౌపతీ ముర్మూ అన్నారు. రామాలయం ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 13 లక్షలమంది భక్తులు ఆలయాన్ని, బాల రాముణ్ణి దర్శించుకున్నారని రాష్ట్రపతి చెప్పారు. జనవరి 22వ తేదీన జరిగిన రామాలయంలో బాలరాముడి ప్రతిష్ఠాపన ఒక గొప్ప క్షణాలుగా అభివర్ణించారు. ఉగ్రవాదం దగ్గర నుండి దేశంలో ద్రవ్యోల్బణం వరకూ పలు విషయాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. “ఈనాడు ప్రభుత్వం సరికొత్త మౌలిక సదుపాయాలను దేశంలో నిర్మిస్తోంది, సరిహద్దుల్లో కంచెలు నిర్మిస్తోంది, వాటిని ప్రాధాన్యతాంశాలుగా భావించింది, ఈ పని ఏనాడో చేసి ఉండాల్సింది, కానీ ఈనాడు మా ప్రభుత్వం చేస్తోంది, ఉగ్రవాదం, విస్తరణవాదం వంటివాటిని ఎదుర్కొనేందుకే ఈ చర్యలన్నీ, అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతాం” అన్నారు. దేశీయ భద్రత మెరుగుపడిందన్నారు. ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు మంచి విజయాలు సాధించారన్నారు.
గుర్రాల రథంలో సభాస్థలికి రాష్ట్రపతి
సెంగోల్‌తో ఊరేగింపుగా సభలోకి…

ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం కొత్త సంప్రదాయం ప్రారంభించింది. రాష్ట్రపతి కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేటపడు ఒక అధికారి తలకు టోపీతో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే దుస్తులు ధరించి చేతిలో ‘సెంగోల్‌’ ధరించి రాష్ట్రపతి వెంట నడిచారు. కొత్త సభా భవంతిలో సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి లోనికి ప్రవేశించేటప్పుడు సరికొత్త సంప్రదాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీవ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌ జోషి,లోక్‌సభ, రాజ్యసభల సెక్రటరీ జనరల్స్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌, పి.సి.మోడీ తదితర గణంతో ఊరేగింపుగా రాష్ట్రపతి సభలోకి ప్రవేశించారు. కొత్త భవంతిలో మొదటిసారి రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఆరు గుర్రాలను పూన్చిన రథంలో కూర్చుని రక్షణ దళాలు రథాన్ని తోలు తుండగా రాష్ట్రపతి కొత్త పార్లమెంటరీ భవంతికి వచ్చారు. ఈ సందర్భంగా వాయిద్య సంగీతకారులు బ్యాండ్‌ వాయించారు. భారత్‌ మాతాకీ జై…జై శ్రీరామ్‌ అనే నినాదాలు ఈ సందర్భంగా మిన్నుముట్టాయి. రాష్ట్రపతి వెంట అధికారి మోసుకువచ్చిన సెంగోల్‌ను ఆమె కూర్చున చోటనే వేదికపై బల్లమీద ఆమె ఎదురుగా ఉంచారు. పార్లమెంటు భవంతిలోకి గజదారం లోంచి రాష్ట్రపతి ప్రవేశించారు. 58 దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. బ్రెజిల్‌, ఈజిప్టు, మాల్దీవులు, నేపాల్‌ దౌత్యవేత్తలు, బ్రిటన్‌ హై కమీషనర్‌ కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments